శ్రీ భీమేశ్వర సందర్శనం



ఈ సువిశాల మహీతలంలో భారతదేశం పవిత్రమైంది. భారతదేశంలో ఆంధ్రప్రాంతంలో గౌతమీ మండలం పరమ పవిత్రమైంది. అట్టి గౌతమీ మండలంలో దక్షారామం మహామహిమాన్వితమైన దివ్య క్షేత్రం. కాశీ మోక్షప్రదమైన క్షేత్రం. కాగా దక్షిణ కాశీగా ప్రసిద్ధికెక్కిన దక్షారామం భోగమోక్షాలకు ఆలవాలమైన దివ్యక్షేత్రంగా వసుధలో వాసికెక్కింది. దీనిని "దక్షారామాత్పరం క్షేత్రం నభూతో నభవిష్యతి" అంటూ వ్యాస భగవానుడు భీమఖండంలో అఖండంగా స్తుతించాడు.

దక్షారామం ప్రసిద్ధమైన, ప్రధానమైన, ప్రముఖమైన పవిత్ర క్షేత్రం. ఇది పంచారామాలలో ఒకటి. పూర్వం శంకరుడు త్రిపురాసుర సంహార సమయంలో త్రిపురదైతేయుల కులదైవమైన ఒక పంచముఖ లింగాన్ని మాత్రం విడిచి వివిధ వస్తు సముదాయాన్ని భస్మం కావించాడు. అట్టి పంచబ్రహ్మ, పంచాక్షరీ, పంచత్వ, పంచభూతమయైన లింగాన్ని పంచఖండాలుగా ఖండించి వానిని ప్రతిష్ఠించవలసిందిగా మహేశుడు దేవతల కాజ్ఞాపించాడు.

అమరేశ్వరుడైన ఇంద్రుడు కృష్ణాతీరంలో వానిలోని ఒక ఖండాన్ని ప్రతిష్టించాడు. గౌతమీ తీరంలో గుణుపూడి గ్రామంలో సోముడు ఒక ఖండాన్ని ప్రతిష్టించాడు.

శ్రీరామచంద్రప్రభుడు పాలకొల్లు ప్రాంతంలో ఒక ఖండాన్ని ప్రతిష్ఠించాడు. భీమశంకరుడు భీమమైన ఓంకారనాదంచేస్తూ తన మామగారైన దక్షుని ఆరామంలో ప్రతిష్ఠితుడయ్యాడు. శ్యామలకోట (సామర్లకోట) సమీపంలోని

భీమవరం ప్రాంతంలో కుమారస్వామి ఒక ఖండాన్ని ప్రతిష్ఠించాడు. అవే అమరారామం, సోమారామం, క్షీరారామం, దక్షారామం, కుమారారామం అనే పంచారామాలై ప్రసిద్ధి వహించాయి. ఆ పంచబండాలు అమరేశ్వరస్వామి, సోమేశ్వరస్వామి, రామలింగేశ్వరస్వామి, దక్షారామ భీమలింగేశ్వరస్వామి, కుమార భీమలింగేశ్వరస్వామి అనే పంచలింగాలుగా వెలిశాయి. అట్టి సుప్రసిద్ధమైన పంచారామాల్లో దక్షారామం ఒకటి.

"భద్ర పాతాళభైరవి పావితంబై, గుహ వినాయక రక్షణా కుంఠితంబై, సప్తమాతృక పరివారసం కులంబై, వసుమతీనూపురమై దక్షవాటీపురం అలరారుతోంది. దక్షవాటంబు కంటే తీర్థంబు నిఖిలమేదినీ మండలంబున లేదు. శ్రీ దక్షవాటీ పురంబు భుక్తి ముక్తులు రెంటికి పుట్టినిల్లు.

దక్షవాటికి పరమశివుని అంతఃపురం. శివుని మామయైన దక్షుని సవనాగారం, దక్షాధ్వరం సాగిన దివ్యక్షేత్రం. దక్షతనయ అయిన సతీదేవి యాగాగ్నిని సృష్టించుకొని ముక్తిపొందడంచేత దక్షారామం ముక్తిక్షేత్రమైంది. మంకణ మహర్షికి సంకల్పసిద్ధి లభింపజేసిన సిద్ధక్షేత్రం దక్షారామం. దక్షారామ క్షేత్రం ముక్తిక్షేత్రం, యోగక్షేత్రం, తపోక్షేత్రం, వసిష్ఠ, వాలఖిల్య, అత్రి, శాండిల్య, అంగీరసాది ఎనుబది యెనిమిదివేల మహర్షులకు నిత్యనివాస క్షేత్రం, వ్యాస మహర్షికి కాశీ వియోగదుఃఖాన్ని నివారించి శాంతి రక్షను, ప్రశాంత భక్షను ప్రసాదించిన శాంతినిలయం దక్షారామం. అగస్త్యుని పాలిటి ఆనంద నిలయం దక్షారామం. దక్షారామం దేవతల రక్షణ కార్యకలాపాలకు నిలయం. పాలకడలిని దేవదానవులు మందర పర్వతాన్ని కవ్వంగా చేసికొని మధనం చేస్తున్న సమయంలో భీమమైన హాలాహలం జనించింది. దక్షపురాధ్యక్షుడైన శివుడు భువన సంహారకమైన మహావిషాన్ని కంఠాన ధరించాడు. సప్తపాతాళభేదనమూర్తి సప్త ఊర్ధ్వ లోకాలను, సప్త అధోలోకాలను భీమమైన కాలకూటాన్ని మ్రింగి రక్షించాడు. పదునాలుగు యుగాల ముదుసరియైన భీమశివుణ్ణి నీలకంఠుని జేసి లోకరక్షణ, దేవతారక్షణ కావించిన క్షేత్రం దక్షారామం.
.....For Puchasing Book Contact Writer

I BUILT MY SITE FOR FREE USING